
Picture Courtsey: Google
మీ కొత్త సంసారములో మీరు ఇద్దరు జోడు ఎడ్ల లాంటి వారు. ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు. నీ కాబోయే భార్యకి కూడా సంసారపు బాధ్యతలు క్రొత్తే, కాబట్టే, ఇద్దరు సర్దుకు పోవాలి. పంతాలు, పట్టింపులు మర్చిపోవాలి. ఇంటి బాధ్యత ఇద్దరిది. తాను కూడా ఉద్యోగమూ చేసి అలసి ఇంటికి వస్తుంది. కాబట్టి, వంట ఇద్దరు కలిసి చేసుకుంటే, ఎంతో తొందరగా అయిపోతుంది, రుచిగా కూడా ఉంటుంది. తాను అలసి ఇంటికి వస్తే, ముందే ఇంటికి వచ్చిన నువ్వు తనకి ఒక్క కప్ కాఫీ కలిపి ఇస్తే, నువ్వు ఏమి తక్కువగావు కానీ, తన కళ్ళలో అప్పుడు నీ మీద కనిపించే ఆ ప్రేమలో మట్టుకు తప్పకుండ మునిగి పోతావు.
తన వంట ఏ రోజు నా వంట లాగా ఉండదు, అలాగే నా వంట తనదిగా ఉండదు. నీ లౌక్యం ఇక్కడే చూపించాలి మరి. ఎప్పుడు మా ఇద్దరిని పోల్చదు. అమ్మలాగా, భార్య ఉండగలదు ఏమో కానీ, భార్యలాగా అమ్మ ఉండదు కదా. అందుకే, మా ఇద్దరినీ రెండు కళ్ళలాగా చూసుకో చాలు. ప్రతి అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటాయి, కానీ వాటిలోకి నువ్వు రావలిసిన పని లేదు. నువ్వు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మీ నాన్నగారి నుంచి ఈ విషయము నువ్వు నేర్చుకోవాలి.
ఇంకో ముఖ్య విషయము, తాను భార్య కాబట్టి, తన జీతము నీకు ఇవ్వాలి అన్ని అనుకోకు. మీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. అంతేగాని నీ కంట్రోల్లోనే ఇంటిలో ఖర్చులు జరగాలి అన్ని అనుకోకు. తాను ఒక్క వేళా వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వాలి ఆంటే వద్దు అనవద్దు.
నీ భార్య అమ్మ నాన్న కూడా నీకు ఇంకో అమ్మ నాన్న లాగానే అనుకోవాలి కానీ, వాళ్ళు నీకు అల్లుడుగా మర్యాదలు చేసి, కట్న కానుకలు ఇవ్వాలి అని అనుకోకూడదు. అల్లుడుగా మర్యాదలు పొందే ముందు, కొడుకుగా నీ బాధ్యతలు నిర్వర్తించి చూపు. నీ భార్యనే నీ అతి పెద్ద కట్నము, కానుక అనుకున్న రోజు ఏ గొడవలు ఉండవు.
నీ జీవితము తనతో, పంచుకోవటంతో నీ పని అయిపొయింది అనుకోకు, ఇంటి పనులలో భాగము పంచుకోవటంతో మొదలు పెట్టి, తన మనసులో చోటు సంపాదించుకో. పిల్లల పెంపకంలో కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి. తనకి ఒంట్లో బాగాలేక పొతే, అమ్మ లాగా తనని చూసుకోవాలి. తనకి కావలిసిన ప్రపంచము నీలో తనకి కనిపించాలి. అది తల్లి, తండ్రులాగా, ఒక్క ఆప్త మిత్రుడిలాగా, ఒక్క నెచ్చలిగా, ఒక్క కొడుకుగా అన్ని నువ్వే అనిపించాలి. అప్పుడే భర్తగా నీ కర్తవ్యము నువ్వు సరిగా నిర్వర్తించినట్టు.
నేను చెప్పిన ఈ ఐదు విషయాలు గుర్తు పెట్టుకొంటావు కదూ, ఆ ఒక్క ప్రామిస్ నాకు చేస్తే చాలు, నిన్ను ఇంకా ఏమి అడగను.
This article was originally published in Momspresso Telugu.